ఉ.కొరియా: ఉ.కొరియా విషయంలో ఆసియా దేశాలు మాతో చేతులు కలపాలి: డొనాల్డ్ ట్రంప్
- ఉ.కొరియాపై ఆంక్షల తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం
- ఐక్యరాజ్య సమితి వేదికగా ట్రంప్ మొదటిసారి ప్రసంగం
- ఉ.కొరియాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ కలకలం రేపుతోన్న ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి వేదికగా ట్రంప్ మొదటిసారి ప్రసంగించారు. క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఉత్తరకొరియాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అన్నారు. ఉత్తర కొరియాతో పాటు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, వెనిజులాలో నెలకొన్న సంక్షోభం వంటి అంశాలపై కూడా ట్రంప్ ప్రసంగించారు.
ఉత్తరకొరియా, ఇరాన్ లతో ప్రపంచ దేశాధినేతలు చర్చలు జరపాలని అన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తూ ప్రతి రోజు ఎక్కడో చోట దాడులు జరుపుతోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఓడిపోయిన వారిగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఇటీవల అమెరికా ఐరాస భద్రతా మండలిలో చేసిన ముసాయిదా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.