ఉత్తర కొరియా: తన మొబైల్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఉత్తర కొరియాకు సమీపంగా తరలించిన జపాన్

- జపాన్ రక్షణ మంత్రి సునారియో నోడెరా ప్రకటన
- 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా
దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న ఉత్తర కొరియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న జపాన్.. తన మొబైల్ క్షిపణి రక్షణ వ్యవస్థను తూర్పు తీరంలోని హోక్కైడోకు తరలించింది. కొన్ని రోజుల క్రితం ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి ఈ ప్రాంతం నుంచే ప్రయాణించింది. జపాన్ రక్షణ మంత్రి సునారియో నోడెరా ఈ విషయంపై మాట్లాడుతూ... పాట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను దక్షిణ హోక్కైడో ద్వీపంలోని హకేడేట్ లాంచింగ్ స్టేషన్‌కు పంపినట్లు చెప్పారు.
ఈ మొబైల్ క్షిపణి 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు. ఈ క్షిపణిని 34 పీఏసీ-3 అని పిలుస్తారు. ప్రస్తుతం జపాన్ రెండంచెల క్షిపణి రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. జపాన్‌లో 2015లో ఆమోదించిన కొత్త రక్షణ చట్టం ప్రకారం తమ మిత్రదేశం అయిన అమెరికా భద్రతకు ఏ దేశం నుంచి అయినా ప్రమాదం పొంచి ఉంటే క్షిపణులను ప్రయోగించవచ్చు.