డీకే అరుణ: నాసిరకం చీరలను వెంటనే వెనక్కు తీసుకోవాలి: డీకే అరుణ డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను మాట్లాడే భాషను ఇంకా మార్చుకోలేదని, మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బతుకమ్మ చీరల పేరిట తమకు నాసిరకం చీరలు ఇచ్చారని నిన్న పలు ప్రాంతాల్లో మహిళలు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు కారణం ప్రతిపక్ష నేతలేనని కేటీఆర్ మండిపడ్డ నేపథ్యంలో డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని డీకే అరుణ విమర్శించారు. ఓ వైపు మహిళలు ఆందోళనలు చేస్తోంటే మరోవైపు అన్నదమ్ములు లేని తమకు చీరలు పంపించినందుకు కేటీఆర్‌కి మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. చీరల కోసం ఖర్చు చేసిన డబ్బు ప్రజల సొమ్మని, టీఆర్ఎస్ పార్టీ నేతల డబ్బుకాదని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. నాసిరకం చీరలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.