: సూపర్ కింగ్స్ కు షాక్... ముంబయ్ చేతిలో చిత్తు!
వరుస విజయాలతో దూసుకెళుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబయి ఇండియన్స్ బౌలర్లు షాకిచ్చారు. అసాధ్యం కాని 140 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టు 15.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్-6లో ఇదే అత్యల్పస్కోరు. లక్ష్యఛేదనకు ఉపక్రమించిన చెన్నై జట్టును తొలుత మిచెల్ జాన్సన్ (3/27) వణికించగా.. మిడిల్ ఓవర్లలో మలింగ (2/6), ఓజా (3/11) రెచ్చిపోయారు.
ముంబయి బౌలర్ల ధాటికి ముగ్గురు చెన్నై బ్యాట్స్ మెన్ ఖాతా కూడా తెరవలేకపోగా.. మరో నలుగురు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. సూపర్ ఫినిషర్ గా పేరుగాంచిన కెప్టెన్ ధోనీ 10 పరుగులకే వెనుదిరగడం జట్టుపై ప్రభావం చూపింది. ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది.