చంద్రబాబు: పిల్లల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు
- కర్నూలులో ‘బాలల భద్రతే భారత భద్రత’ బహిరంగ సభ
- పిల్లల హక్కులను పరిరక్షించాలని 40 ఏళ్లుగా కైలాశ్ సత్యార్థి పోరాటం
- పిల్లలు దేవుళ్లతో సమానం
పిల్లల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో ‘బాలల భద్రతే భారత భద్రత’ పేరుతో బహిరంగ సభ జరిగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నశించిపోవాలని, పిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలకు తల్లిదండ్రులు పాల్పడవద్దని అన్నారు. పిల్లలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు.
చదువును కొనసాగించేందుకు సహకరించకపోవడం, వారిని పనుల్లో పెట్టడం వంటివి అనాగరికులు చేసే చర్యలుగా చంద్రబాబు అభివర్ణించారు. పిల్లల హక్కులను పరిరక్షించాలని 40 ఏళ్లుగా కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారని అన్నారు. పిల్లల పరిరక్షణ కోసం కైలాశ్ సత్యార్థి నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులే చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని, ఇలాంటి వాటిని నాగరిక ప్రపంచం ఒప్పుకోదు, సహించబోదని చంద్రబాబు అన్నారు.