జీవన్ రెడ్డి: మీ ఆడబిడ్డలు ఇటువంటి చీరలు కట్టుకుంటారా?: జీవన్ రెడ్డి
- మా నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయా?
- సిరిసిల్లలోనూ చీరలపై మహిళలు ఆందోళన చేశారు కదా?
- పేదలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చులకన భావం
కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజక వర్గాల్లోనే మహిళలు చీరలు తగులబెట్టారన్న మంత్రి కేటీఆర్ వాదనలో నిజం లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. నిన్న పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మహిళలు ఆందోళన తెలపడానికి ప్రతిపక్ష పార్టీల నేతల కుట్రలే కారణమంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... సిరిసిల్లలోనూ మహిళలు నిరసన వ్యక్తం చేశారని, ఆ ప్రాంతంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీ ఆడబిడ్డలు ఇటువంటి చీరలు కట్టుకుంటారా?’ అని సీఎం కేసీఆర్‌ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చులకన భావం ఉందని పేర్కొన్నారు. నిన్న నిరసనలో పాల్గొన్న వారిపై సర్కారు కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తోందని మండిపడ్డారు. నిజంగా నిరుపేద కుటుంబాలపై కేసీఆర్‌కి ప్రేమ ఉంటే వారి నిత్యావసరాలైన చక్కెర, కందిపప్పు, గోధుమ వంటి సరుకులన్నింటినీ కలిపి 100 రూపాయలకి అందించాలని అన్నారు. ఇటువంటి చీరలు ఇచ్చి పేదలను అవమానించకూడదని వ్యాఖ్యానించారు.