నితీశ్ కుమార్: కర్ణాటక సర్కారుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ మండిపాటు
- గౌరీ లంకేశ్ హత్యకేసులో ఇంతవరకు ఎంతమందిని అరెస్టు చేశారు?
- ఈ కేసులో పురోగతి లేదు
- మీడియా కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడగడం లేదు
సీనియర్ జర్నలిస్ట్, హేతువాది గౌరీ లంకేశ్ హత్యకేసులో ఇంతవరకు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఈ కేసులో విచారణను మెల్లిగా జరుపుతున్నారని ఆరోపించారు. ఈ రోజు పాట్నాలో నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఇప్పటివరకు పురోగతి లేదని అన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సమర్థవంతంగా విచారణ జరిపించడంలో పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ఎంతమందిని అరెస్టు చేశారనే విషయంపై వార్తలు కూడా రావడం లేదని నితీశ్ కుమార్ అన్నారు. ఒకవేళ ఇటువంటి ఘటనే తమ బీహార్ లో జరిగి ఉంటే ఎంతో రచ్చ చేసేవారని వ్యాఖ్యానించారు. ఈ కేసు ఏమయిందని మీడియా కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడగడం లేదని ఆయన అన్నారు. కాగా, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనను తాను సమర్థిస్తున్నట్లు నితీశ్ కుమార్ పేర్కొన్నారు.