వెంకయ్య నాయుడు: ఇంతకు ముందున్న సీఎంలు ఎవ్వరూ కేసీఆర్ లా ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోలేదు: వెంకయ్య ప్రశంసల జల్లు
- కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం తెలుగు భాషను తప్పనిసరి చేయడం
- మనమంతా మాతృభాషను మర్చిపోతున్నాం
- భవిష్యత్తు తరాలు తెలుగు భాష తియ్యదనాన్ని అనుభవించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయం తెలుగు భాషను తప్పనిసరి చేయడమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళికి అందించిన తరువాత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. తెలుగు భాష గురించి మాట్లాడారు. ఇతర దేశాల అధ్యక్షులు సైతం మన దేశానికి వచ్చినప్పుడు వారి భాషలోనే మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.
వారికి ఇంగ్లిష్ రాకకాదని, అది వారి భాషపై ఉండే అభిమానం అని చెప్పారు. తెలుగు భాషను తప్పని సరిచేశారు కాబట్టి కేసీఆర్ని ప్రశంసిస్తున్నానని, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనిది కేసీఆర్ చేశారని, గొప్ప నిర్ణయం తీసుకున్నారని వెంకయ్య అన్నారు. మనమంతా మాతృభాషను మర్చిపోతున్నామని, మన భవిష్యత్తు తరాలు తెలుగు భాష తియ్యదనాన్ని అనుభవించాలని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే ఇది వీలుకాదని తెలిపారు.