: బహిరంగ మలవిసర్జన చేస్తున్న వారి ఫొటో పంపిస్తే రూ. 100 బహుమతి.. గ్వాలియర్ లో వినూత్న ప్రయోగం!
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నం
- సదరు వ్యక్తికి రూ.250 జరిమానా
- స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా అమలు
- విమర్శిస్తున్న సామాజిక కార్యకర్తలు
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్ ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాలు తమకు తోచిన విధంగా వినూత్న ప్రయత్నాలను ముందుకు తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా యంత్రాంగం కూడా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో జిల్లా పరిధిలో ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు కనిపిస్తే వారి ఫొటో తీసి, వాట్సాప్ ద్వారా జిల్లా పరిశుభ్రత విభాగానికి పంపించాలని కోరింది.
అలా చేస్తే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టి రూ. 250 జరిమానా విధించి, ఫొటో పంపిన వారికి రూ. 100 బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది విడుదలైన భారత టాప్ 100 స్వచ్ఛ నగరాల్లో గ్వాలియర్ 27వ స్థానంలో ఉంది. ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వెంటనే ఈ పద్ధతిని నిలిపివేయాలని సామాజిక కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పంపిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ కాకుండా చూసుకుంటామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది.