: ఉత్తర కొరియా అణు ప్రయోగాల కారణంగా తగ్గిన పర్వతం ఎత్తు!
- బయటపెట్టిన రాడార్ చిత్రాలు
- 6 అణుపరీక్షల్లో 5 పరీక్షలను ఈ పర్వత ప్రాంతంలోనే నిర్వహించారు
- భూగర్బ అణు పరీక్షల వల్ల ప్రమాదం
- భూకంపాలు వచ్చే అవకాశం
ఇటీవల మంటప్ పర్వతం కింద ఉత్తర కొరియా చేసిన భూగర్భ అణుపరీక్షల కారణంగా ఆ ప్రాంతంలో 85 ఎకరాల మేర భూమి ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఎయిర్‌బస్ సింథటిక్ అపెర్చర్ రాడార్ శాటిలైట్ పంపిన చిత్రాలను బట్టి చూస్తే మంటప్ పర్వతం ఎత్తులో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఉత్తర కొరియా కచ్చితంగా అత్యంత తీవ్రత గల హైడ్రోజన్ బాంబును పరీక్షించి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో అణుపరీక్షలు జరుపుతున్న కారణంగా కూడా పర్వత భౌతిక స్థితిలో మార్పు వచ్చి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు ఉత్తర కొరియా జరిపిన 6 అణుపరీక్షల్లో 5 పరీక్షలను ఈ పర్వత ప్రాంతంలో ఉన్న పంగ్యే-రీ వద్దనే పరీక్షించారు. అందులోనూ సెప్టెంబర్ 3న జరిపిన అణుపరీక్ష తీవ్రత మిగతా 4 అణుపరీక్షల కంటే ఎక్కువగా ఉండటంతో పర్వత భౌగోళిక పరిమాణం మీద తీవ్ర ప్రభావం పడి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రపంచంలో భూగర్భ అణు పరీక్ష విధానాలను ఇంకా ఉపయోగిస్తున్న ఏకైక దేశం ఉత్తర కొరియా. ఇలా పరీక్షలు కొనసాగుతూ పోతే చాలా ప్రమాదముంటుందని, తీవ్రంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని సెంటర్ ఫర్ నాన్‌ప్రొలిఫిరేషన్ స్టడీస్ అధ్యాపకులు చెబుతున్నారు.