: రోహింగ్యాలను భారత్‌లో ఎందుకు ఉండనివ్వరు?: మోదీ సర్కారుపై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
- రోహింగ్యాలను ఐఎస్ వాడుకొనే ప్రమాదం ఉందన్న కేంద్ర సర్కారు
- మోదీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ ఎంపీ అసదుద్దీన్
- రోహింగ్యాలను ఎందుకు సోదరులుగా గుర్తించరని ప్రశ్న
మయన్మార్ సైన్యం తమ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేస్తోన్న రోహింగ్యా ముస్లిం ప్రజలు భారత్‌లోకి ప్రవేశిస్తే భారతీయులపై కూడా వారు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రోహింగ్యా ముస్లింలను ఇస్లామిక్ స్టేట్ వాడుకొనే ప్రమాదం కూడా ఉందని పేర్కొంది. అంతేగాక, దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వారు క్రియాశీలంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని చెప్పింది.
ఈ కారణాల వల్లే రోహింగ్యా శరణార్థులను దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం సరికాదని కేంద్రం సూచించింది. అయితే, ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. రోహింగ్యా శరణార్థులకు భారత్‌లో అసలు ఎందుకు ఆశ్రయం కల్పించబోరని నిలదీసే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ ని సోదరి అని అంటోన్న మోదీ.. మయన్మార్ రోహింగ్యాలను ఎందుకు సోదరులు అని అనరని ప్రశ్నించారు. భారత్‌లోకి ప్రవేశిస్తోన్న రోహింగ్యాలను మళ్లీ తిప్పి పంపాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని వ్యాఖ్యలు చేశారు.