: చైనా భాషలో రీమేక్ కానున్న `దృశ్యం` సినిమా!
- హక్కులు కొనుక్కున్న చైనా నిర్మాణ సంస్థ
- చైనా సంస్థ పునర్నిర్మాణ హక్కులు తీసుకున్న మొదటి భారతీయ సినిమా
- ఇప్పటికే సింహళ భాషలో కూడా రీమేక్ అయింది
2013లో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన `దృశ్యం` సినిమా ఇప్పటికీ ఏదో రికార్డు సృష్టిస్తూనే ఉంది. మలయాళంలో రూ. 50 కోట్ల పైగా వసూలు చేసిన మొదటి సినిమాగా, చాలా స్క్రీన్లలో 150 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడిన చిత్రంగా గతంలో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను ఓ చైనా నిర్మాణ సంస్థ కొనుక్కున్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తెలిపారు. ఇలా చైనా కంపెనీ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మొదటి భారతీయ సినిమా ఇదేనని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి కూడా రీమేక్ అయి, కోట్లు వసూలు చేసింది. ఇటీవల `ధర్మయుధయ` పేరుతో శ్రీలంకలో సింహళీ భాషలో కూడా రీమేక్ అయింది. అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. చైనీస్ భాషలో కూడా `దృశ్యం` చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం అభిప్రాయపడుతోంది. జపనీస్ భాషలో వచ్చిన `ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.