: పాక్ లో బట్టబయలైన ఐసిస్ నెట్ వర్క్!
- పిండి మిల్లులో ప్రధాన స్థావరం
- స్థావరంపై భద్రతా బలగాల దాడులు
- కీలక నేత కాల్చివేత
ఉగ్రవాదులకు తాము ఆశ్రయం ఇవ్వడం లేదని, ఉగ్ర జాడలు తమ దేశంలో లేవని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన పాకిస్థాన్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఐసిస్ జాడలు పాక్ లో కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెషావర్ శివార్లో ఉన్న ఓ పిండి మిల్లును ప్రధాన కార్యాలయంగా చేసుకుని ఐసిస్ కొన్నాళ్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ విషయం తాజాగా ఇంటెలిజెన్స్ రిపోర్టుతో వెలుగు చూసింది.
పాక్ భద్రతా బలగాలు నిన్న ఈ స్థావరంపై దాడులు జరిపి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. చనిపోయినవారిలో ఒకరు కీలక నేత కాగా, మరొకరిని అతని సహాయకుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఐసిస్ కు చెందిన ఓ మహిళా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి యత్నించబోగా... అప్రమత్తమైన భద్రతాదళాలు ఆమెను అరెస్ట్ చేశాయి.