: పాకిస్థాన్ తో ఆడాలని ఇండియాపై మేమెలా ఒత్తిడి తెస్తాం?: ఐసీసీ
- ఇండో-పాక్ సిరీస్ లపై జోక్యం చేసుకోలేమన్న ఐసీసీ
- పాక్ తో ఆడాలని ఇండియాపై ఒత్తిడి తీసుకురాలేం
- ఇరు దేశాల మధ్య సంబంధాలపైనే క్రికెట్ ఆధారపడి ఉంది
పాకిస్థాన్ తో ఆడటానికి భారత్ సిద్ధంగా లేదని... ఈ నేపథ్యంలో, పాక్ తో ఆడాలంటూ బీసీసీఐపై తాము ఎలా ఒత్తిడి తీసుకురాగలమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ ప్రశ్నించారు. లాహోర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కంటే ఇండియా క్రికెట్ వైపే ఐసీసీ ఎక్కువ మొగ్గు చూపుతుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అన్ని సభ్య దేశాల మధ్య సన్నిహిత సంబధాలు ఉండాలనే తాము కోరుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని... ఇరు దేశాల సంబంధాలపైనే క్రికెట్ ఆధారపడి ఉంటుందని తెలిపారు.
2008 నుంచి పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లకు ఇండియా ఒప్పుకోని విషయం తెలిసిందే. ఈ విషయంపై రిచర్డ్ సన్ మాట్లాడుతూ, ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంటే తలపడాల్సిందే కదా అని చెప్పారు. ఇండో పాక్ క్రికెట్ సంబంధాల విషయంలో ఐసీసీ తల దూర్చదని... తటస్థంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ గడ్డపై ఆ దేశంతో ఆడుతున్న వరల్డ్ ఎలెవెన్ టీమ్ లో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడంపై రిచర్డ్ సన్ స్పందించారు. ప్రపంచ టీమ్ లో ఇండియన్ ఆటగాళ్లు ఉండుంటే సిరీస్ మరింత విజయవంతం అయ్యుండేదని చెప్పారు. అయితే, ఇదే సమయంలో భద్రతకు సంబంధించిన టెన్షన్ కూడా ఎక్కువై ఉండేదని అన్నారు.