: చెన్నై మెరీనా బీచ్ లో ఉద్రిక్తత... దినకరన్, దీప వర్గీయుల బాహాబాహి
- అన్నాదురై జయంతి సందర్భంగా గొడవ
- ఒకేసారి వచ్చిన దినకరన్, దీప వర్గీయులు
- వాగ్వాదంతో మొదలై తోపులాట వరకూ..
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
తమిళనాట టీటీవీ దినకరన్, దీపా జయకుమార్ ల మధ్య అమ్మ వారసత్వ పోరు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి సాక్షిగా ఇరు వర్గాలూ బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఉదయం అన్నాదురై జయంతి సందర్భంగా ఇద్దరు నేతల కార్యకర్తలూ ఒకేసారి నివాళులు అర్పించేందుకు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ వాగ్వాదానికి దిగగా, ఓ దశలో తోపులాట కూడా జరిగింది.
ఒకే సమయంలో దినకరన్, దీపా జయకుమార్ లు అక్కడికి రావడంతో వాతావరణం వేడెక్కింది. ఇద్దరి వెంటా ఉన్న కార్యకర్తలు తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు హోరెత్తించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. పరస్పర దాడులకు ప్రయత్నించారు. అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఈ ఘటన జరిగింది. ఇరు వర్గాలనూ చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెరీనా బీచ్ లో ప్రశాంతత నెలకొందని అన్నారు.