: ఆమెకు పిచ్చిపట్టిందన్న ట్రంప్... గట్టిగా సమాధానం చెప్పిన హిల్లరీ!
అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి కారణాలను వివరిస్తూ హిల్లరీ క్లింటన్ `వాట్ హ్యాపెన్డ్` పేరిట పుస్తకం రాసి విడుదల చేశారు. దీని విడుదలకు ముందే అమెరికాలోని చాలా బుక్‌షాపుల ముందు జనం క్యూ కట్టారు. అయితే ఈ పుస్తకంపై అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి పోటీగా నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. `పిచ్చిపట్టిన హిల్లరీ క్లింటన్ తను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను మిగతా వాళ్లపై రుద్దుతోంది. కానీ అసలు కారణం ఆమే!` అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై హిల్లరీ గట్టిగా స్పందించారు. `నీకు నా పుస్తకం నచ్చకపోతే, ఈ పుస్తకం చదువు - ఇందులో కలిసికట్టుగా పనిచేసి, సమస్యలను పరిష్కరించే విధానాల గురించి చక్కగా వివరించారు` అంటూ మరో పుస్తకం `ఇట్ టేక్స్ ఎ విలేజ్` పుస్తకం కవర్ ఫొటోను పోస్ట్ చేసింది. హిల్లరీ ట్వీట్‌ను చాలామంది ప్రశంసించారు. దీనికి 31,000కి పైగా రీట్వీట్లు, లక్షకి పైగా లైకులు వచ్చాయి.