: డేరా కూలుతోంది... గుర్మీత్ కుడి భుజం దిలావర్ ఇన్సాన్ అరెస్ట్
- హింసకు ప్రేరేపించాడని ఆరోపణలు
- డేరా అధికార ప్రతినిధిగా పనిచేసిన దిలావర్
- నేడు న్యాయస్థానం ముందుకు
- వెల్లడించిన హర్యానా డీజీపీ బీఎస్ సంధూ
దాదాపు 20 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన గుర్మీత్ రామ్ రహీమ్ డేరా కుప్పకూలుతోంది. గుర్మీత్ ఇప్పటికే జైల్లో ఉండగా, డేరా మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని ఆయన అనుచరుల్లో ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్ కుడి భుజంగా చెప్పుకునే దిలావర్ ఇన్సాన్ ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్మీత్ పై అత్యాచార ఆరోపణలు నిరూపితమై, శిక్ష పడన తరువాత హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు డేరా అధికార ప్రతినిధిగా దిలావర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. పానిపట్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, శుక్రవారం కోర్టు ముందు హాజరు పరుస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ సంధూ వెల్లడించారు. ఆగస్టు 25న గుర్మీత్ పై నేరం నిరూపితమైన తరువాత దిలావర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిపారు. కాగా, బుధవారం నాడు డేరా ఐటీ విభాగం హెడ్ వినీత్ ఇన్సాన్ ను సిర్సాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, జైల్లో ఉన్న గుర్మీత్ ను అతని తల్లి నసీబ్ కౌర్ కలిశారు. కుమారుడితో 20 నిమిషాల పాటు గడిపిన ఆమె, జైలు వాతావరణం, ఆరోగ్యం తదితరాల గురించి అడిగి తెలుసుకున్నారు.