: అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి రెడీ: రేవంత్ రెడ్డి
- ఎక్కడ నుంచి పోటీకైనా సిద్ధం
- రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసిన కేసీఆర్
- టీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేయండి
- రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నల్గొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి ఆయనే దీటైన అభ్యర్థి అని పలువురు జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ స్పందించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, నల్గొండే కాదు ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. జిల్లాల విభజనతో రాష్ట్ర ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా కేసీఆర్ చేశారని అన్నారు.
రైతు సమితుల ముసుగులో రజాకార్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. సమితుల పేరుతో వచ్చే టీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే, మన ఊరు మన ప్రణాళిక ఏమయ్యాయని ప్రశ్నించారు.