: హాలీవుడ్ నటితో హానీమూన్ కు ట్రెజరీ చీఫ్.. మిలిటరీ విమానాన్ని అడిగిన వైనం
- చిక్కుల్లో అమెరికా కోశ విభాగ చీఫ్
- ఇటీవలే వివాహం చేసుకున్న అధికారి
- వ్యక్తిగత అవసరానికి విమానం కోరి విమర్శలపాలు
అమెరికా కోశ విభాగ చీఫ్ స్టీవెన్ నుచిన్ తన హానీమూన్ కు అమెరికా మిలిటరీ జెట్ విమానాన్ని అడిగి విమర్శల్లో చిక్కుకున్నారు. ఇటీవలే ఆయన ఓ హాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నారు. అనంతరం, యూరప్ కు హానీమూన్ కు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు జెట్ విమానాన్ని ఏర్పాటు చేయాలని... దానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన మాట మార్చారు. తన వ్యక్తిగత అవసరాల కోసం విమానాన్ని అడిగినట్టు, ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఖర్చులను తానే భరిస్తానని చెప్పానని తెలిపారు.
జాతాయ భద్రత అంశాల మీదే తాను సగం సమయాన్ని గడుపుతుంటానని... ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాల వ్యవహారాల్లో కూడా తలమునకలై ఉంటానని స్టీవెన్ చెప్పారు. ఈ నేపథ్యంలో, తాను ప్రయాణాల్లో ఉన్నప్పుడు భద్రత అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే... జెట్ విమానం అయితేనే సేఫ్ గా ఉంటుందని భావించానని తెలిపారు. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని... మిలిటరీ విమానంలో తాను వెళ్లబోనని చెప్పారు. తన వ్యక్తిగత అవసరాల కోసం విమానాన్ని కోరలేదని తెలిపారు.