: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే నీకూ పడుతుంది!: కిమ్ జాంగ్ ను హెచ్చరించిన యూఎస్ మీడియా
* మమ్మల్ని చూసి నేర్చుకోండి
* సాంకేతిక పరిజ్ఞానంతోనే అభివృద్ధి
* అమెరికాకు ఎదురు నిలవడం అసాధ్యం
* మా శక్తితో పోలిస్తే మీరేపాటి?
వరుసగా క్షిపణి పరీక్షలకు పాల్పడుతూ, నిత్యమూ రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్న వేళ, ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను ఎలాగైనా అదుపు చేయాలని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న సమయంలో, యూఎస్ మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశాభివృద్ధి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే సాధ్యమైందని, ఉత్తర కొరియా వంటి దేశాలు తమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగి సత్ఫలితాలు సాధించాలే తప్ప, దాడులకు తెగబడతామంటే, సాధించేది ఏమీ ఉండబోదని వ్యాఖ్యానించింది.
గతంలో తమకు పట్టుబడిన దేశాధినేతలు సద్దాం హుస్సేన్, గడాఫీ వంటి వారికి పట్టిన గతే కిమ్ జాంగ్ కు పడుతుందని, తమను ఎదుర్కోవచ్చన్న కలలను ఆయన కంటున్నారని పేర్కొంది. ఒక హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ఏదో సాధించామని అనుకుంటే పొరపాటని, అమెరికా వద్ద అంతకు ఎన్నో రెట్లు అధిక శక్తిమంతమైన బాంబులున్నాయని, వాటితో పోలిస్తే, కిమ్ వద్ద ఉన్న అణ్వస్త్రాలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అమెరికాకు ఎదురు నిలవడం అసాధ్యమని, యుద్ధానికి కాలు దువ్వుతూ అమెరికాను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతోనే ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోందని ఆరోపించింది. కాగా, నార్త్ కొరియా నేడు మరోసారి జపాన్ మీదుగా ఓ క్షిపణిని పరీక్షించగా, అది పసిఫిక్ మహాసముద్రంలో పడిన సంగతి తెలిసిందే.