: చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడిన సిలిండర్లు.. రైళ్ల నిలిపివేత!
హైదరాబాద్ నగర శివారులోని చర్లపల్లిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్ కూడా పక్కనే ఉండడంతో సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలుతూ ఒకదాని తర్వాత ఒకటి తారాజువ్వల్లా గాల్లోకి లేచాయి. దీంతో సమీప కాలనీ వాసులు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి చేరుకున్నారు. పెద్ద చర్లపల్లి, చిన చర్లపల్లి, భరత్‌నగర్, మింట్ కాలనీ, మహాలక్ష్మీనగర్, గాంధీనగర్, ఈసీ నగర్ తదితర 15 కాలనీల ప్రజలు భయంతో వణికిపోయారు.
హెచ్‌పీసీఎల్ ప్లాంటు మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనికి సమీపంలోనే ఐవోసీఎల్, బీపీసీఎల్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతాయి. రోజుకు 15 వేల సిలిండర్లను నింపే సామర్థ్యం ఉంది. మూడు షిఫ్టుల్లో కలిసి మొత్తం 170 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో వందమంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి చర్లపల్లి మీదుగా వెళ్లే విమానాలను తాత్కాలికంగా ఇతర మార్గాలకు మళ్లించారు. అలాగే పలు రైళ్లను కూడా నిలిపివేశారు. ప్రమాదం రాత్రి 8:30 గంటల సమయంలో సంభవించగా రెండున్నర గంటల ప్రయత్నం తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదని, 50 సిలిండర్లు మాత్రమే పేలాయని అధికారులు తెలిపారు. నష్టం విలువను అప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రమాదం లేదని, అందరూ ఇళ్లకు వెళ్లాలని కాలనీ వాసులను అధికారులు కోరారు.