: లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ ను హతమార్చిన భారత సైన్యం!
జమ్ముకశ్మీర్, శ్రీనగర్ శివారులోని నౌగమ్ ప్రాంతంలో ఈ రోజు ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా అగ్రనేత అబూ ఇస్మాయిల్ తో పాటు మరో ఉగ్రవాది హతమయ్యాడు. అబూ ఇస్మాయిల్ ఈ ఏడాది జులై 11న అమర్‌నాథ్ యాత్రికులపై జరిపిన కాల్పుల ఘటనకు సూత్రధారి. ఆ దాడిలో పలువురు యాత్రికులు మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.
అప్పట్లో భద్రతా బలగాలు అక్కడికి ప్రవేశించడంతో ఉగ్రవాదులు పారిపోయారు. మరి కొందరు ఉగ్రవాదులతో కలిసి ఇస్మాయిల్ ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చిన టాప్ టెర్రరిస్టుల్లో ఇస్మాయిల్ నాలుగవ వాడు. కొన్ని నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ బుర్హాన్ వనీ, మరో టాప్ లీడర్ సబ్జర్ భట్ హతమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఎల్ఈటీ కమాండర్ అబు దుజానాని కూడా భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.