: టీమిండియాకు షాక్.. ఆస్ట్రేలియా సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం!
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు దూరమయ్యాడు. ఐదు వన్డేల సిరీస్ కు గాను తొలి మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ధావన్ కు చోటు కల్పించినప్పటికీ... తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో, టీమ్ నుంచి తనను రిలీజ్ చేయాలంటూ బీసీసీఐను ధావన్ కోరాడు. దీంతో, వెంటనే అతన్ని రిలీజ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయించింది. ధావన్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డే నుంచి ధావన్ అర్థాంతరంగా వైదొలగాడు. అప్పుడు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ధావన్ స్వదేశానికి చేరుకున్నాడు.
పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొనే క్రమంలో ధావన్ పై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను అర్థాంతరంగా వైదొలగడంతో టీమ్ కు షాక్ తగిలింది. శ్రీలంక టూర్ లో ధావన్ చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ధావన్ స్థానాన్ని రహానేతో భర్తీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.