: జపాన్ పై అణు బాంబేస్తామని హెచ్చరించిన నార్త్ కొరియా... కొత్త టెన్షన్!


తూర్పు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ, జపాన్ దేశాన్ని తమ అణుబాంబులతో సముద్రంలో ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. "ఇక మా దేశానికి సమీపంలో ఉండే అర్హత జపాన్ కు ఎంతమాత్రమూ లేదు" అని ప్రభుత్వ రంగ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ గురువారం నాడు హెచ్చరించింది. జపాన్‌కు చెందిన నాలుగు ద్వీపాలనూ ఒక అణుబాంబు వేయడం ద్వారా చిత్తు చేస్తామని, తమను తాము కాపాడుకునేందుకు ఇదో మార్గమని పేర్కొంది. ఇక ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిహైడ్ సుగా స్పందిస్తూ, కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని అన్నారు.

నార్త్ కొరియా ఇదే ధోరణిలో ఉంటే, ప్రపంచంలోనే ఏకాకిగా మిగిలిపోతుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సమాజం ఉత్తర కొరియాపై మరింత ఒత్తిడి తెచ్చేలా విధానాలను మార్చుకోవాలని సూచించారు. ఈ నెల ప్రారంభంలో ఓ శక్తిమంతమైన అణుబాంబును నార్త్ కొరియా ప్రయోగించగా, ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బొగ్గు, ఖనిజాలు, ఇంధన ఎగుమతులను ఆ దేశానికి ఆపేయాలని, వారు తయారు చేసే దుస్తులను ఎవరూ దిగుమతి చేసుకోవద్దని ఐరాస భద్రతామండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది కూడా. ఉత్తర కొరియా తాజా హెచ్చరికలు ఈ ప్రాంతంలో కొత్త టెన్షన్ కలిగిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News