: కాస్పరస్కీ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించిన అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు
రష్యా ప్రభుత్వంతో గూఢచర్య సంబంధాలను కొనసాగిస్తోందన్న కారణంగా సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పరస్కీ అందించే యాంటీ వైరస్, యాంటీ ఫిషింగ్ వంటి ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాలని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఎలాయన్ డ్యూక్ ఆదేశించారు. 90 రోజుల్లోగా కాస్పరస్కీ సంబంధిత ఉత్పత్తులను రక్షణ విభాగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దీంతో ఫెడరల్ వ్యవస్థలన్నీ కాస్పరస్కీ సేవలను నిలిపివేసే పనిలో పడ్డాయి.
2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం అమెరికా ఫెడరల్ వర్గాలు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రష్యా ప్రమేయం ఉందనడానికి ఊతమిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనిపై కాస్పరస్కీ కంపెనీ భిన్నంగా స్పందించింది. తమకు రష్యాతో గానీ, మరే ఇతర దేశాల ప్రభుత్వాలతో గానీ అధికారిక సంబంధాలు లేవని, అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇలా చేయడం సరికాదని వాదిస్తోంది.