: ఈ రైలుతో దేశాభివృద్ధి పరుగులు: నరేంద్ర మోదీ


మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల జీడీపీ పెరుగుదలకు, మరింత మెరుగైన ఉపాధికి బులెట్ రైలు ప్రాజెక్టు దోహదపడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ లో జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి భారత తొలి బులెట్ రైలు ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, ఈ రైలుకు రూ. 88 వేల కోట్లను రుణంగా అందించేందుకు జపాన్ ముందుకు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, అందుకు షింజోకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. షింజో తనకు దగ్గరి సన్నిహితుడని, అటువంటి మిత్రుడు ఉంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం పెరుగుతుందని అన్నారు. రైల్వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, ముంబై, అహ్మదాబాద్ ల మధ్య విమానాల్లో తిరిగేందుకు ఎవరూ ఇష్టపడబోరని చమత్కరించారు.

ఈ ప్రాజెక్టు ఇండియాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని, భవిష్యత్తులో ఎన్నో నగరాల మధ్య బులెట్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. గడచిన 100 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఇండియా వృద్ధికి హై స్పీడ్ కనెక్టివిటీ దోహదపడుతోందని, అది మొబైల్ నెట్ వర్క్ అయినా, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అయినా, రైల్ నెట్ వర్క్ అయినా హై స్పీడ్ కీలకమని అన్నారు. ఎవరైనా సాయం చేస్తే భారతీయులు మరచిపోరని, ముఖ్యంగా గుజరాతీల్లో స్నేహ భావం అధికమని, జపాన్ ను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని చెప్పారు. జపాన్ వంటి స్నేహితుడు దొరకడం భారత్ అదృష్టమని అన్నారు.

"ఇండియాలో బ్యాంకులు అప్పులు తీసుకుంటే 10 శాతం, 12 శాతం, 18 శాతం వడ్డీలు వసూలు చేస్తూ, ఐదేళ్లలో తీర్చాలి. పదేళ్లలో తీర్చాలి. 20 ఏళ్లలో తీర్చాలని నిబంధనలు విధిస్తుంటాయి. కానీ, జపాన్ వంటి నిజమైన మిత్రుడు మాత్రమే 88 వేల కోట్ల రూపాయలను 50 సంవత్సరాల కాల పరిమితిపై కేవలం 0.01 శాతం వడ్డీకి రుణమిస్తోంది. ప్రతిగా మనం ఏం చేయగలం?. కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టు బులెట్ రైల్లో చార్జీలు అధికంగా ఏమీ ఉండవు. సాధారణ ప్రయాణికులు సైతం ప్రయాణించేంత తక్కువ ధరే ఉంటుందన్న భరోసాను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే, మూడు గంటల్లోనే రెండు నగరాల మధ్యా ప్రయాణం సాకారమవుతుంది. విమానాశ్రయానికి గంట ముందు వెళ్లి, అక్కడి చెకింగ్ పూర్తి చేసుకుని, విమానం ఎక్కి, ప్రయాణం చేసి, గమ్యస్థానంలో దిగి, ఇల్లు చేరుకునే సమయంతో పోలిస్తే తక్కువ టైమ్ లోనే రైలెక్కి కూడా వెళ్లిపోవచ్చు" అని అన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని, పెట్రో వనరులను ఆదా చేసుకుని, మిగిలే వనరులను ఎగుమతి చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News