: టీమిండియాకు అతను తిరుగులేని ఆస్తి!: చీఫ్ కోచ్ రవిశాస్త్రి


‘2019 ప్రపంచకప్ ప్రణాళికల్లో ధోని ఉన్నాడా?’ అనే ప్రశ్నకు టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సమాధానమిస్తూ, టీమిండియాకు తిరుగులేని ఆస్తి ధోనీ అని, డ్రెస్సింగ్ రూమ్ లో ధోని పెద్దన్న లాంటి వాడని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనియే అని, అందరికంటే వేగంగా పరిగెత్తగలడని అన్నారు. శ్రీలంకలో ధోని ప్రదర్శన ట్రైలర్ మాత్రమేనని, ధోనీ అసలు ఆటను మున్ముందు చూస్తారని చెప్పిన రవిశాస్త్రి, టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడం ధోనీకి లాభించిందని, వన్డేలకు మరింత ఫిట్ గా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని అన్నారు.

‘2019 ప్రపంచకప్ నేపథ్యంలో ధోని, యువరాజ్ లపై ఓ నిర్ణయం తీసుకోవాలని ద్రవిడ్ అనడంపై..’ అని ప్రశ్నించగా రవిశాస్త్రి సమాధానమిస్తూ, తానేమి సెలెక్టర్ ను కాదని, అత్యుత్తమ ఫీల్డింగ్ జట్టు ఉండాలన్నది తమ అభిమతమని, టీమ్ ఇండియా జట్టు ఎంపికకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రమాణాల మేరకు జట్టు ఎంపికకు అర్హులేనని, ఆ తర్వాత జట్టు కూర్పు, ప్లేయర్స్ ఫామ్ లో ఉండటం అనే అంశాలు పరిగణనలోకి వస్తాయని అన్నారు. యువరాజ్ గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో తనకు తెలియదని చెప్పిన రవిశాస్త్రి, గత రెండు, మూడేళ్లుగా సెలెక్టర్ల పనితీరు గొప్పగా ఉందని కితాబిచ్చారు. ధోని గురించి ప్రస్తావిస్తూ, అతని ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయని, అతని ఫామ్ ఇలాగే కొనసాగితే 2019 ప్రపంచకప్ లో తప్పక ఉంటాడని, ధోనీ లేని జట్టును ఊహించలేమని రవిశాస్త్రి పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News