: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారి ఆఖరి క్షణాల వీడియో లభ్యం!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారి హత్య కేసులో పోలీసులు అత్యంత కీలకమైన సాక్ష్యాన్ని సంపాదించారు. ఏడేళ్ల బాలుడు ప్రధ్యుమన్ థాకూర్ విగతజీవిగా కనిపించిన టాయిలెట్ల వద్ద అమర్చిన ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫుటేజ్ లో తొలుత చిన్నారి టాయిలెట్ లోకి వెళ్లాడు. ఆపై నిమిషాల వ్యవధిలోనే బాలుడిని హత్య చేసినట్టు భావిస్తున్న బస్ కండక్టర్ అశోక్ కుమార్ టాయిలెట్ లోకి ప్రవేశించాడు.
ఆపై కాసేపటికి రక్తం కారుతున్న స్థితిలో ప్రధ్యుమన్ బయటకు వచ్చి పడిపోయాడు. అక్కడి గోడలకు రక్తపు మరకలు అయ్యాయి. మూడు నిమిషాల్లోనే బాలుడు కుప్పకూలిన ఆ ప్రాంతం రక్తంతో నిండిపోయింది. కాగా, పోస్టుమార్టం నివేదిక ప్రకారం, మెడవద్ద రెండు కత్తి పోట్ల కారణంగా నిమిషాల వ్యవధిలో అధిక రక్తస్రావం జరిగి చిన్నారి మరణించాడని, స్వరనాళం తెగిపోవడంతో సాయం చేయాలని కనీసం కేకలు కూడా పెట్టలేకపోయాడని తెలుస్తోంది. ఆ బాలుడిని లైంగికంగా వేధించాలన్న ఉద్దేశంతో ఉన్న అశోక్ కుమార్, బాలుడు నిరాకరించినందునే హత్య చేశాడని, చేసిన హత్యను అతను అంగీకరించాడని పోలీసులు గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.