: మూడు రోజులు సెంట్రల్ కోర్టు హోటల్ లో విచ్చలవిడి ఎంజాయ్... చాందినీ జైన్ కేసులో షాకింగ్ విషయాలు!
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ హత్యకేసును విచారిస్తున్న పోలీసులకు విభ్రాంతి కలిగించే షాకింగ్ విషయాలు తెలిశాయి. కొన్ని రోజుల ముందు వివిధ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 52 మంది విద్యార్థినీ విద్యార్థులు లక్డీకపూల్ లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో మూడు రోజులు గదులు తీసుకుని గడిపారు. ఆ మూడు రోజులూ పార్టీలతో హోరెత్తించారు. రాత్రుళ్లు అక్కడే ఉన్నారు. వీరు మైనర్లని కూడా చూడకుండా హోటల్ యాజమాన్యం మద్యాన్ని సరఫరా చేసింది.
'నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్' అనే వెబ్ పేజీని ప్రారంభించుకున్న వీరు హైదరాబాద్, బెంగళూరులోని ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాలల్లో చదువుతున్న వారని, వీరంతా ఈ నెల 1 నుంచి 3 వరకూ 23 గదులను బుక్ చేసుకుని విచ్చలవిడిగా గడిపారని పోలీసులు తేల్చారు. వారిలో చాందినీ జైన్ కూడా ఉందని, హోటల్ కు వచ్చిన వారిలో చాలా మంది ఇళ్లల్లో అబద్ధాలు చెప్పి వచ్చిన మైనర్లేనని వెల్లడించారు. ఈ సదస్సులో సోహెల్ అనే విద్యార్థి చాందినీ జైన్ కు పరిచయం కావడం, వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడంతోనే సాయికిరణ్ రెడ్డికి ఆగ్రహం తెప్పించి వుండవచ్చని, అదే హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. ఇక చాందినీని హత్య చేసిన సాయికిరణ్ మైనర్ కావడంతో, జువైనల్ చట్టాల మేరకే విచారణ ఉంటుందని స్పష్టం చేసిన పోలీసులు, తమ తల్లిదండ్రులు ఇప్పటికైనా పిల్లలు చేస్తున్న పనులపై ఓ కన్నేయాలని సూచిస్తున్నారు.