: దటీజ్ ప్రవీణ్ అనిపించుకున్న నేవీ మాజీ కమాండో.. 72 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేసిన 26/11 హీరో!


అతని పేరు ప్రవీణ్ తియోటియా. వయసు 32 ఏళ్లు. ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర అవార్డు అందుకున్న ధీశాలి. నవంబరు 26, 2008లో ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన నేపథ్యంలో అప్పటి మెరైన్ కమాండో అయిన ప్రవీణ్ ముష్కరులతో వీరోచితంగా పోరాడాడు. ఈ క్రమంలో అతడి శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. అందులో ఒకటి ఊపిరితిత్తుల్లోకి దూసుకుపోగా మరోటి చెవిని దెబ్బతీసింది. దీంతో పాక్షికంగా శ్రవణ శక్తిని కోల్పోయాడు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వినికిడి సమస్య తలెత్తడంతో అధికారులు అతడిని నాన్-యాక్టివ్ ఉద్యోగంలోకి మార్చారు.

అయితే తాను ఫిట్‌గానే ఉన్నానని, తనలో చేవ ఇసుమంతైనా తగ్గలేదని అధికారులకు తెలియజెప్పి తిరిగి మునుపటి విధుల్లో చేరేందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా మారథాన్లలో పాల్గొంటున్నాడు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఈ నెల 9న  లడఖ్‌లో జరిగిన 72 కిలోమీటర్ల ఖర్దుంగ్ లా  మారథాన్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు నిర్ణీత సమయంలో మారథాన్‌ను పూర్తి చేసి మెడల్ గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా బులందేశ్వర్‌లోని భటోలాకు చెందిన ప్రవీణ్ మాట్లాడుతూ తనకు బుల్లెట్ గాయాలు అయ్యాక ఇక విశ్రాంతే శరణ్యమని వైద్యులు చెప్పారని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఆసుపత్రిలో ఐదు నెలలు ఉన్నాక ఆరోగ్యం కుదుటపడిందని, చెవుల పనితీరు మెరుగుపడిందని వివరించాడు. మారథాన్ రన్నర్ పర్వీన్ బట్లివాలను కలిసిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తనను బాగా ప్రోత్సహించారని ప్రవీణ్ తెలిపారు. కాగా, జూలై 31న ప్రవీణ్ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News