: తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు
తెలంగాణ సమాచార కమిషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార హక్కు చట్టం -2005 కింద ఈ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపికకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైనట్టు పేర్కొంది. ఈ కమిటీలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలోనే త్రిసభ్య కమిటీ సమావేశమై సభ్యులను ఎంపిక చేయనుంది. త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన కమిషనర్ల జాబితాను గవర్నర్ కు సిఫార్సు చేస్తే ఆయన నియామక ఉత్తర్వులు ఇస్తారు. కాగా, రాష్ట్ర పునర్విభజన దృష్ట్యా ఉమ్మడి కమిషన్ విభజన జరిగింది. తెలంగాణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది. తెలంగాణ సమాచార కమిషన్ కార్యాలయాన్ని మొజాంజాహి మార్కెట్ వద్ద గల గృహ నిర్మాణ మండలి భవనంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
11 మంది సభ్యులతో రాష్ట్ర సమాచార కమిషన్ ... ప్రధాన కమిషనర్ తో పాటు మరో పది మంది కమిషనర్ల నియామకానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ కు ఎన్నికల కమిషనర్ తో సమానమైన జీతభత్యాలు లభిస్తాయి. ఇతర సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని సమాచారం. ఇక కమిషనర్ల విషయానికొస్తే, వీరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానమైన జీతభత్యాలు ఉంటాయి. 65 ఏళ్లు నిండే వరకు లేదు ఐదేళ్ల పాటు మాత్రమే ఈ పదవిలో వారు కొనసాగుతారు. ఈ పదవుల్లో పునర్నియామకాలకు అవకాశం లేదు. ఈ పదవిలో కొనసాగేవారిపై అభియోగాలు వచ్చినా, అశక్తులని తేలినా వారిని తొలగించే అధికారం గవర్నర్ కు మాత్రమే ఉంటుంది.
ఈ పదవులకు ఎవరు అర్హులంటే ... ప్రజాజీవితంలో ప్రముఖులు, విజ్ఞానవంతులు, న్యాయశాస్త్రం, శాస్త్ర, సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వహణ, పరిపాలనలో మంచి అనుభవం గడించిన వారు అర్హులు. కాగా, తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్ల పదవుల కోసం శాసనసభ మాజీ కార్యదర్శి రాజా సదారాంతో పాటు పలువురు పోటీలో ఉన్నారు.