: కోహ్లీని హేళన చేసినందుకు ఆస్ట్రేలియా మీడియాపై పాకిస్థానీయుల తిట్ల దండకం!
ఇటీవలే టీచర్స్ డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్‌కి భారతీయుల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ, పాకిస్థానీయుల నుంచి మాత్రం ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీకి మరోసారి పాకిస్థానీయులు అండగా నిలబడ్డారు. విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా తీరు ఎలా ఉంటుందో తెలిసిందే. కొన్ని నెలల క్రితం భారత్, ఆస్ట్రేలియా టెస్టు జరుగుతోన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మీడియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చింది. అప్పట్లో నెటిజన్లు ఆస్ట్రేలియా మీడియాపై విమర్శలు చేశారు. ఇప్పటికి కూడా ఆ తీరునే కొనసాగిస్తూ ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు కోహ్లీని స్వీపర్ గా పేర్కొంటూ.. కోహ్లీ గతంలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటుండగా తీసిన ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
నిన్న లాహోర్‌లో పాకిస్థాన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ క్రికెట్ మ్యాచులు ప్రారంభమైన నేపథ్యంలో కోహ్లీ ఇలా స్టేడియాన్ని ఊడ్చుతున్నాడని అందులో పేర్కొన్నాడు. దీనిపై కోహ్లీ పాకిస్థాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీకి మద్దతుగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌ను, ఆస్ట్రేలియా జర్నలిస్టును వెక్కిరిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ టెస్టుల్లో ఐదవ స్థానంలో ఉంటే భారత క్రికెట్ టీమ్ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేస్తూ స్వీపర్ల కన్నా ఆస్ట్రేలియా కింది స్థాయిలో ఉందని వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు.
కొద్దిగా మర్యాదగా ట్వీట్లు చేయడం నేర్చుకోవాలని, ఇది క్రికెట్ ఆట అని రాజకీయాలు కాదని మరో పాకిస్థానీ కామెంట్ చేశాడు. క్రికెట్ లో లెజెండ్ లాంటి కోహ్లీపై ఇటువంటి ట్వీట్లు చేయవద్దని, తమ దేశంలో జరుగుతోన్న వరల్డ్ ఎలెవన్ టీమ్‌లో కోహ్లీ లేనందుకు తాము ఎంతగానో బాధపడిపోతున్నామని మరో అభిమాని ట్వీట్ చేశాడు. కోహ్లీపై పాకిస్థానీయులు ఇంతగా ప్రేమ చూపిస్తుండడం విశేషమే మరి!