: మందుబాబు నిర్వాకం.. కొడుకును అమ్మేశాడు.. ఆ డబ్బుతో తాగి తందనాలాడాడు!
ఒడిశాలోని భద్రక్‌లో ఓ తండ్రి చేసిన నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. కన్న కొడుకును అమ్మేసి సెల్‌ఫోన్ కొనుక్కుని, మిగిలిన డబ్బుతో మద్యం తాగి తందనాలాడాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, స్వీపర్‌గా పనిచేస్తున్న బలరాంముఖి అనే వ్యక్తి తాగుడుకి బానిసయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఇటీవల ఇతనిని కలిసిన ఓ అంగన్వాడీ కార్యకర్త ఓ వృద్ధ దంపతులు ఓ బాలుడిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పి, తన 11 నెలల కుమారుడిని ఇస్తే కనుక డబ్బు ఇస్తారని చెప్పాడు.
దాంతో బలరాం అందుకు సరేనని, రూ.23 వేలకు బేరం కుదుర్చుకుని పిల్లాడిని అమ్మేశాడు. వాటిల్లో రూ.2 వేలతో సెల్‌ఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బు నుంచి తన పాపకు రూ.1500తో వెండి కడియాలు చేయించాడు. మిగతా సొమ్మును తాగి తందనాలాడడానికి ఖర్చు చేసేశాడు. ఇతని నుంచి బాలుడిని కొనుక్కున్న 60 ఏళ్ల సోమనాథ్ సేథి ప్రభుత్వ సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. అతని ఒకేఒక్క సంతానమైన కొడుకు ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో అతడి భార్య డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి ఓ పిల్లాడిని దత్తత తీసుకోవాలనుకుని బలరాం తనయుడిని కొనుక్కున్నాడు. చివరికి ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
.