: లీడర్ చంద్రబాబునాయుడు గారంటే చాలా ఇష్టం: సినీ నటి వాణీవిశ్వనాథ్
రాజకీయాల్లోకి కనుక వస్తే తాను తెలుగుదేశం పార్టీలోనే చేరతానని సీనియర్ సినీ నటి వాణీ విశ్వనాథ్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నన్ను టీడీపీలో చేరమని కోరుతూ గతంలో కొందరు నాయకులు వచ్చి కలిశారు. ‘రాజకీయాల్లోకి కనుక నేను వచ్చేట్టయితే టీడీపీలోనే చేరతాను’ అని వాళ్లకు చెప్పాను. మన దేశంలో చూసుకుంటే.. లీడర్స్ విషయంలో చంద్రబాబునాయుడు గారంటే నాకు చాలా ఇష్టం.
ఆ పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నా, తెలుగు ప్రజలు అన్నా నాకు ఇష్టం. నేను తెలుగు సినిమాల్లో నటించడం ఎప్పటి నుంచి అయితే ప్రారంభించానో, అప్పటి నుంచే తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు జ్యోతిష్యుడు. నాకు పదమూడేళ్ల వయసు తర్వాత సినిమాల్లో నటించే అవకాశం ఉంది అని చెప్పారు. అది జరిగింది. అలాగే, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందనీ చెప్పారు. నేను రాజకీయల్లోకి రావాలనే దానిపై మా ఇంట్లో మంచి సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ కన్నా, తెలుగు ప్రజల సపోర్టే చాలా ముఖ్యం. ఆ సపోర్ట్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను.
ప్రజలకు ఏదైనా సేవ చేసే అవకాశం వస్తే, నేను తప్పకుండా చేస్తాను. రాజకీయం అనేది వ్యక్తులతో ఉన్న పోటీ కాదు. రాజకీయమనేది అదొక సేవ .. సిద్ధాంతం. నాకు అవకాశమిస్తే .. ఆ సిద్ధాంత పరంగా పార్టీ కోసం నేను ఏం చెయ్యాలో అది చేస్తాను. అంతే తప్పా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా రోజా గారికి దీటుగా, ప్రత్యామ్నాయంగా ఉండేందుకో నేను రాజకీయాల్లోకి రావాలని భావించడం లేదు. త్వరలో చంద్రబాబును కలిసి రాజకీయ కార్యాచరణను వివరిస్తా’ అని చెప్పుకొచ్చారు.