: కాబూల్ క్రికెట్ స్టేడియం బయట ఆత్మాహుతి దాడి!
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బయట ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. స్థానికంగా నిర్వహిస్తున్న టీ 20 మ్యాచ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. ఎంత మంది వ్యక్తులు గాయపడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, రెండు జట్లకు చెందిన క్రికెటర్లందరూ క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు చెప్పినట్టు టోలో న్యూస్ టెలివిజన్ సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ సంఘటన ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాగా, కాబూల్ లో ని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గడచిన సోమవారం క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.