: ఆ విషయంలో నారా లోకేశ్ స్పష్టత ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ సొంతంగా పోటీ చేసి గెలుస్తుందా? లేక మిత్రపక్షం అయిన బీజేపీతో కలసి పోటీ చేసి విజయం సాధిస్తుందా? అనే విషయమై మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ఏ విధంగానైతే బలపడాలని కోరుకుంటోందో, అదే విధంగా బీజేపీ కూడా కోరుకుంటోందని అన్నారు.
బీజేపీ కూడా రాష్ట్రంలోని 175 స్థానాల్లో బలపడాలని కోరుకుంటోందని, రాష్ట్రంలోనూ తమ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ చెప్పడం ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడం లేదనే విషయం స్పష్టమైందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.