: ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఆవిష్కరణ వేడుకలో పనిచేయని ఫేస్ రికగ్నిషన్ ఫీచర్... వీడియో చూడండి!
ఫేస్ రికగ్నిషన్, రెటీనా డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ ఎక్స్ విడుదలైంది. దీని విడుదల కోసం ఏర్పాటు చేసిన వేడుకలో ఫేస్ రికగ్నిషన్ సదుపాయం ఎలా పనిచేస్తోందో చెప్పడానికి ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెదరిజీ ఓ డెమో చూపించాడు. అయితే ఈ డెమోలో ఆయన ప్రయత్నిస్తున్నపుడు ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ఫేస్ ఐడీ సదుపాయం పనిచేయలేదు. స్క్రీన్ ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేసి తిరిగి ప్రయత్నించాడు.
అయినా ఫలితం లేకపోవడంతో పక్కనే ఉన్న వేరే ఐఫోన్ ఎక్స్ మోడల్ తీసుకుని, ముఖాన్ని ఒకసారి తుడుచుకుని ప్రయత్నించాడు క్రెయిగ్. ఈ రెండో ఐఫోన్ ఎక్స్ క్రెయిగ్ ముఖాన్ని గుర్తించింది. ఐఫోన్ ఎక్స్‌లో `హోం` బటన్ లేదు. ఫోన్‌ను వాడుకోవడానికి స్క్రీన్‌ని ఒకసారి టచ్ చేయాలి. తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆపిల్ కొత్త ఉత్పత్తులను డెమో చూపిస్తున్నపుడు ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో స్టీవ్ జాబ్స్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కున్నారు.