: సింగపూర్ అధ్యక్ష పీఠంపై తొలి మహిళ.... హలీమా యాకుబ్... ఏకగ్రీవంగా ఎన్నిక!
సింగపూర్ పార్లమెంట్ మాజీ స్పీకర్ హలీమా యాకుబ్‌ను మొదటి అధ్యక్షురాలిగా నిర్ణయిస్తూ సింగపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. పోటీగా ఎవరూ లేకపోవడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారి తెలియజేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుగా కనిపించే సింగపూర్‌లో ఈసారి అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వాన్ని మైనారిటీగా ఉన్న మలయ్ కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వ్ చేశారు.
`ఇది రిజర్వ్‌డ్ ఎన్నిక అయ్యుండొచ్చు... కానీ నేను మాత్రం రిజర్వ్‌డ్ అధ్యక్షురాలిని మాత్రం కాదు. నేను అందరి అధ్యక్షురాలిని` అని హలీమా తన ప్రసంగంలో చెప్పారు. నిజానికి ఈ ఎన్నికలకు హలీమాతో కలిపి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు మలయ్ కమ్యూనిటీకి చెందిన వారు కాకపోవడం, మరో ఇద్దరు అర్హత పత్రాలు సమర్పించని కారణంగా వారి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో హలీమా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.