: హీరోయిన్ కాజల్ ఫొటోతో ఓ మహిళకు రేషన్ కార్డ్ జారీ!
తమిళనాడు ప్రభుత్వం గతంలో జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకొస్తోంది. దీనిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సంబంధిత అధికారులు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళకు జారీ చేసిన స్మార్ట్ కార్డులో ఆమె ఫొటోకి బదులు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫొటో ప్రింట్ చేసి, ఆ కార్డు ఆ మహిళకు పంపించారు.
తన ఫొటో ఉండాల్సిన చోట హీరోయిన్ ఫొటో ఉండడంతో ఆమె షాక్ అయింది. ఈ విషయాన్ని ఆ మహిళ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఒక్క కార్డులోనే కాకుండా చాలా మంది లబ్ధిదారుల కార్డుల్లోనూ ఇలాగే తప్పులు వచ్చాయని అధికారులు గుర్తించారు. కొన్ని నగరాల్లో స్మార్ట్ కార్డుల్లో నటులతో పాటు పలు వస్తువుల ఫొటోలు కూడా వచ్చాయని కొందరు అంటున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.