: యాంటీ థెఫ్ట్ ప్యాకేజింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న ఫ్లిప్‌కార్ట్... దేశంలో ఇదే మొదటిసారి!
సరుకుల రవాణాలో భాగంగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటి విలువైన వస్తువులు చోరీకి గురికాకుండా చూసుకునేందుకు ఒక వినూత్న ప్యాకేజింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆన్‌లైన్ మార్కెట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ప్యాకేజింగ్ విధానం ద్వారా ప్యాక్ చేసిన వస్తువులను విప్పి, మళ్లీ యథాతథంగా ప్యాక్ చేయడం అసాధ్యమని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ సత్యం చౌదరి తెలిపారు.
ఒకవేళ ప్యాకెట్‌ను విప్పితే.. సప్లై చైన్ లో ఉండే తదుపరి వ్యక్తికి లేదా వినియోగదారుడికి తెలిసిపోతుంది. దీంతో, ప్యాకేజ్ ను తిరస్కరించవచ్చు. ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీపై పేటెంట్ కోసం కూడా ఫ్లిప్‌కార్ట్ దరఖాస్తు చేసుకుంది. `ఆన్‌లైన్ క్రయవిక్రయ రంగంలో సరుకుల రవాణాలో దొంగతనాలు ఓ పెద్ద సమస్యగా మారాయి. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు రాళ్లు, చెక్కముక్కలు రావడంతో వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యను నియంత్రించడానికే ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీని పరిచయం చేయబోతున్నాం` అని సత్యం చౌదరి చెప్పారు.