: చనిపోలేదన్న అనుమానంతో లోయలోకి తోసేశాను: చాందినీ హత్యా స్థలంలో పోలీసులకు చెప్పిన సాయికిరణ్
తలపై, మెడపై బలంగా కొట్టినా చనిపోలేదన్న అనుమానంతోనే చాందినీ జైన్ ను లోయలోకి బలంగా తోసేశానని ఆమె హత్య కేసు నిందితుడు సాయికిరణ్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. ఈ ఉదయం అమీన్ పూర్ గుట్టల్లోని హత్యాస్థలికి సాయిని తీసుకెళ్లిన పోలీసులు, మొత్తం ఘటనను రీకానలైజ్ చేశారు. తామిద్దరమూ 9వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నామని, ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, క్షణికావేశంలో ఈ పని చేశానని సాయి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తనతో కలసి అమీన్ పూర్ గుట్టల్లోకి చాందినీ తనంతట తానుగా వచ్చిందని, తానేమీ బలవంతంగా ఆమెను తీసుకురాలేదని వెల్లడించిన సాయి, తమ పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించరేమోనన్న భయం ఉండేదని చెప్పాడని సమాచారం. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన తరువాత చాందినీ ఇంటికి వెళ్లానని సాయి కిరణ్ చెప్పాడు. కాగా, ఇద్దరూ ఓ ఆటో ఎక్కుతున్నట్టు, ఆపై అమీన్ పూర్ గుట్టల వద్ద ఇద్దరూ కలసి వెళుతున్నట్టు సీసీటీవీల్లో రికార్డు కాగా, వాటి ఆధారంగా సాయి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.