: బ్రెగ్జిట్ బిల్లును ఆమోదించిన యూకే పార్లమెంట్
యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటికివచ్చే బ్రెగ్జిట్ బిల్లును యూకే పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా ఎక్కువ మంది బ్రిటన్ ఎంపీలు ఓటు వేశారు. అనుకూలంగా ఓటు వేసినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్రెగ్జిట్ ఆమోదం చారిత్రాత్మక నిర్ణయమని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే తెలిపారు. ఈయూ ఉపసంహరణ బిల్లుకు అనుకూలంగా 326 మంది ఎంపీలు ఓటేయగా, ప్రతికూలంగా 290 మంది వేశారు.
యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టం 1972 ప్రకారం యూకేను ఐరోపా ఆర్థిక సమాజం (ఈఈసీ)లో చేర్చారు. ఇప్పుడు ఆ చట్టాన్ని తొలగించే నిర్ణయంతో బ్రెగ్జిట్ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని టోరీ పార్టీ డిమాండ్ చేసింది. విపక్ష లేబర్ పార్టీ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించినా, జెరెమీ కోర్బైన్ నేతృత్వంలోని ఏడుగురు ఎంపీలు మాత్రం ప్రభుత్వానికి అండగా నిలిచారు. అంతేకాకుండా ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కొంతమంది ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.