: చాందిని హత్యకేసును ఛేదించిన పోలీసులు.. మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితుడు సాయికిరణ్!
సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసు మిస్టరీ వీడింది. స్నేహితుడు సాయికిరణే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలంటూ చాందిని అతడిపై ఒత్తిడి తీసుకురావడమే హత్యకు కారణమని తేల్చారు. హత్యకు ముందు అత్యాచారం జరగలేదని చెప్పిన పోలీసులు మదీనాగూడలో నివాసముంటున్న సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసు పూర్వాపరాలు ఇవీ..
మియాపూర్ మదీనాగూడలో నివాసముండే వస్త్రవ్యాపారి కుమార్తె చాందిని జైన్ (17). ఈనెల 9న సాయంత్రం ఐదు గంటల సమయంలో స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత అమీన్‌పూర్ గుట్టల్లో చాందిని మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా షార్ట్ ధరించిన యువకుడితో కలిసి ఆమె ఆటోలో వెళ్లినట్టు బయటపడింది. దీంతో ఆమె స్నేహితులు పలువురిని విచారించిన పోలీసులు చివరికి చాందిని బాయ్‌ఫ్రెండ్ సాయికిరణే ఆమెను దారుణంగా హత్య చేసినట్టు తేలింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తుండడంతో భరించలేని సాయికిరణ్ ముందస్తు పథకం ప్రకారమే ఆమెను గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.