: స్కూల్ బ్యాగ్ లో పాము.. తరగతి గదిలో చిన్నారిని కాటేసిన వైనం!
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం, దొన్కల్ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం చెలరేగింది. వివేక్ అనే ఒకటో తరగతి విద్యార్థి తన స్కూల్ బ్యాగుని వేసుకుని ఎప్పటిలాగే ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లి తన తరగతి గదిలో కూర్చున్నాడు. అయితే, ఆ బ్యాగులో అప్పటికే పాము ఉంది. ఈ విషయం తెలియని వివేక్ తరగతి గదిలో పుస్తకాల కోసం బ్యాగులో చేతిని పెట్టాడు. అందులో ఉన్న పాము ఒక్కసారిగా ఆ చిన్నారిని కాటు వేసింది. దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పగా వారు వెంటనే వివేక్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థికి ప్రాణ హాని ఏమీ లేదని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.