: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల చెర నుంచి కేరళ క్రైస్తవ మతాధిపతిని కాపాడిన భారత, ఒమన్!
గతేడాది యెమెన్‌లో తీవ్రవాదుల చేతికి చిక్కిన కేరళకు చెందిన క్రైస్తవ మతాధిపతి టామ్ ఉళున్నాలిల్‌ను భారత, ఒమన్ ప్రభుత్వాలు విజయవంతంగా రక్షించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. 2016, మార్చి 4న యెమెన్‌లోని ఏడెన్ ప్రాంతంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీలపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 16 మంది చనిపోయారు. మతాధిపతిని తీవ్రవాదులు చెరలో బంధించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది మేలో తనను కాపాడాలని కోరుతూ టామ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం టామ్ ఒమన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని విడుదలకు సంబంధించిన ఫొటోను ఒమన్ మీడియా ప్రసారం చేసింది. రెండ్రోజుల్లో ఒమన్ నుంచి న్యూఢిల్లీకి టామ్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. టామ్ ను రక్షించినందుకు అతని కుటుంబ సభ్యులు, క్రైస్తవ మతాధిపతులు భారత, ఒమన్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.