: నిన్న గౌరీ లంకేశ్ ని, ఆమె ఆలోచనలని బొంద పెట్టారు.. రేపు నన్ను చంపాలని చూస్తున్నారు: కంచ ఐలయ్య
శ్రమశక్తిని దోచుకునే వారిపై తాను పుస్తకం రాస్తే దానిని విమర్శించడం ఏంటని ప్రొ. కంచ ఐలయ్య ప్రశ్నించారు. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు అని టైటిల్ పెట్టి పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో తన పుస్తకంపై వివరణ ఇచ్చారు. ఆర్యవైశ్యులు ప్రజాస్వామ్యాన్ని రోడ్లపై తగులబెడుతున్నారని మండిపడ్డారు. కింది కులాల వారు పుస్తకం రాసుకోవద్దా? అని ప్రశ్నించారు. తాను గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌లను, చట్టాన్ని గౌరవిస్తానని అన్నారు.
పుస్తకం రాసుకొని తన అభిప్రాయాన్ని తెలిపే హక్కును తనకు అంబేద్కర్ ఇచ్చారని కంచ ఐలయ్య తెలిపారు. నిన్న గౌరీ లంకేశ్ ని, ఆమె ఆలోచనలని బొంద పెట్టారని, రేపు తనని చంపాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను దేవుడిని నమ్ముతానని, దళితులు, బీసీలు, ఆదివాసీలు కొలుచుకునే సమ్మక్క, సారలమ్మ, పోచమ్మ తల్లులని నమ్ముతానని ఆయన అన్నారు.