: పార్టీలోనే ఉండి కొట్లాడతాం... బీజేపీలో చేరుతున్నారనే వార్తలపై కోమటిరెడ్డి స్పందన
కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని... పార్టీలోనే ఉండి కొట్లాడతామని చెప్పారు. ఫంక్షన్ హాల్ లో మీటింగులు పెట్టుకుంటే ఎన్నికల్లో గెలవలేరని... పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సరైన ఫలితాలు రావడం లేదని... ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందేనని అన్నారు.
పీసీసీ చీఫ్ పదవిని తమకు ఏడాది పాటు ఇవ్వాలని... తమకు ఇవ్వకపోతే తెలంగాణ కోసం ఉద్యమించినవారికైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి నాయకత్వంలో పార్టీ దూసుకుపోతుందో... హైకమాండ్ సర్వే చేయించాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని... ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతానని చెప్పారు.