: యూట్యూబ్ ద్వారా దొంగలకు చెక్... ఆగ్రా పోలీసుల వినూత్న ప్రయత్నం
ఒకప్పుడు తప్పించుకుని తిరుగుతున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఇన్‌ఫార్మర్ల సహాయం తీసుకునేవారు. టెక్నాలజీ వచ్చాక వారి అవసరం పెద్దగా లేకుండా పోయింది. దాదాపు అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉండటం, దొంగతనానికి సంబంధించి వీడియో ఫుటేజీలు దొరకడం వల్ల దొంగలను పట్టుకోవడం సులభం అయింది. అయితే ఈ సీసీ ఫుటేజీలు కొన్ని సార్లు నిరుపయోగంగా మారతాయి. వాటిలో దొంగ ముఖాన్ని తొందరగా గుర్తించడానికి వీలు ఉండదు. కానీ దొంగను ఇంతకుముందు చూసిన వాళ్లు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ ఆలోచన ఆధారంగానే ఆగ్రా పోలీసులు `ఆగ్రా రేంజ్ క్రైమ్ వీడియో` పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించారు. అందులో దొంగలను గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోల్లో ఉన్న దొంగలను ఎవరైనా గుర్తిస్తే సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఏటీఎం దొంగతనం, చైన్ స్నాచింగ్ వంటి వివిధ నేరాలకు సంబంధించి 15 వరకు వీడియోలు ఉన్నాయి.