: అవును... నేను కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా పోటీ పడేందుకు సిద్ధం: స్పష్టంగా చెప్పిన రాహుల్ గాంధీ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి పదవికి బరిలోకి దిగబోయేది తానేనని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. రెండు వారాల యూఎస్ పర్యటనలో భాగంగా బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నానని స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రసంగిస్తుండగా, ఓ విద్యార్థి లేచి, 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా, రాహుల్ సమాధాధానం ఇచ్చారు.
తాను తప్పకుండా సిద్ధంగా ఉంటానని, తమది సంస్థాగత పార్టీ అని, ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పార్టీ తేలుస్తుందని అన్నారు. గతంలో తాము కొన్ని తప్పిదాలు చేశామని, భవిష్యత్తులో అటువంటి తప్పులు జరుగకుండా చూసుకుంటామని అన్నారు. కాగా, ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్య చేయడం ఇదే తొలిసారి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ, రాహుల్ ను కాదని మన్మోహన్ సింగ్ కు ప్రధాని బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.