: మిస్ అమెరికా పోటీలో బాలీవుడ్ పాటకి డ్యాన్స్... స్టెప్పులతో అదరగొట్టిన మిస్ మిస్సోరీ
ఇటీవల బాలీవుడ్ పాటలకి పాశ్చాత్య దేశాల్లో క్రేజ్ బాగా పెరిగిపోతోందనడానికి మిస్ అమెరికా పోటీలో బాలీవుడ్ పాటకు ఓ కంటెస్టంట్ డ్యాన్స్ చేయడం మరో నిదర్శనం. మిస్ అమెరికా 2018 పోటీలో మిస్ మిస్సోరీ జెన్నిఫర్ లేయి డేవిస్ టాలెంట్ రౌండ్లో సల్మాన్ ఖాన్ `జై హో` సినిమాలో `నాచో రే` పాటకు స్టెప్పులు వేసి అందరి మనసులు దోచుకుంది. అంతేకాదు ఈ పోటీలో ఆమె రన్నరప్‌గా కూడా నిలిచింది. భారతీయ వస్త్రధారణలోనే జెన్నిఫర్ ఈ పాటకు డ్యాన్స్ వేసింది.
అయితే, ఆమె ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు మాత్రం దొరకలేదు. కాకపోతే ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రత్యక్షంగా చూసిన వాళ్లు మాత్రం ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయినట్లు చెబుతున్నారు. ఆమెకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ నకుల్ దేవ్ మహజన్ మార్గదర్శం చేశారు. ఆయన నేర్పించిన మూవ్‌మెంట్స్‌ను పర్ఫెక్ట్ లిప్‌సింక్‌తో ఆమె ప్రదర్శించినట్లు తెలుస్తోంది. టాలెంట్‌ను ప్రదర్శించడానికి బాలీవుడ్ పాటను ఎంచుకోవడానికి కారణమేంటని న్యాయనిర్ణేతలు ఆమెను అడిగారు. డ్యాన్స్ మీద ఉన్న ఇష్టానికి సంస్కృతితో సంబంధమేంటని జెన్నిఫర్ వారిని తిరిగి ప్రశ్నించినట్లు సమాచారం.